పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు

హైదరాబాద్ | సెప్టెంబర్ 12:పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించిన నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అభినందించారు.నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6 నుంచి 12 వరకు నిర్వహించిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ డి. రమణ ధన్నపునేని, డాక్టర్ ఎం. అమరేష్ రావు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.క్యాంప్‌లో భాగంగా 19 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు నిర్వహించగా, కేవలం 2 కిలోల బరువున్న రెండు నెలల పసికందుకు కూడా విజయవంతంగా శస్త్రచికిత్స చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు వైద్య బృందం చేసిన కృషిని సీఎం ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ పాల్గొన్నారు
