తాజా వార్తలు

ఓబీ మట్టి రవాణాతో రూ.40 లక్షల రోడ్డు ధ్వంసం.. సింగరేణి నిధులతో మళ్లీ మరమ్మతులా?

ఓబీ మట్టి రవాణాతో ధ్వంసమైన రహదారిని పరిశీలిస్తున్న మొలుమూరి శ్రీనివాస్

పెద్దపల్లి, ఆగస్టు 19: సింగరేణి ఆర్‌జీ-3 పరిధి నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఓబీ మట్టిని తరలించేందుకు భారీ వాహనాలను వినియోగించడం వల్ల పన్నూరు సెంటర్ నుంచి ఏఎల్‌పీ మైన్, జీఎం కార్యాలయం, జేఎన్‌టీయూ యూనివర్సిటీ, వి.టి.సి. ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి ధ్వంసమై గుంతలమయంగా మారిందని బీజేపీ ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ ఆరోపించారు.సుమారు రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన రహదారి కొద్దికాలంలోనే దెబ్బతినడానికి ఓవర్‌లోడ్ వోల్వో లారీల రాకపోకలే కారణమని కార్మికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఓబీ మట్టి తరలింపులో వాహనాల బరువు, ట్రిప్పులు, అనుమతులు, పర్యవేక్షణ తదితర అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఓ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు తీవ్రంగా గాయపడి కాలు కోల్పోయిన ఘటన కూడా జరిగిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతిరోజూ సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ఏఎల్‌పీ మైన్ ఉద్యోగులు, జీఎం కార్యాలయ అధికారులు, జేఎన్‌టీయూ యూనివర్సిటీ విద్యార్థులు, వి.టి.సి. శిక్షణార్థులు ఈ రహదారిని వినియోగిస్తున్నందున భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.ఓబీ మట్టి తరలింపునకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఏ ఉత్తర్వులు, ఒప్పందాలు, నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారు? ఎంత పరిమాణంలో మట్టి తరలించేందుకు అనుమతించారు? ఎన్ని వాహనాలు, ఎన్ని ట్రిప్పులు తిరిగాయి? వాహనాల బరువును ఎక్కడ తనిఖీ చేశారు? ఓవర్‌లోడ్ వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రోడ్డు మరమ్మతుల బాధ్యత ఎవరిది? ప్రస్తుతం సింగరేణి ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తోంది? వంటి వివరాలను ప్రజల ముందుంచాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.గతంలో ఓబీ మట్టి తరలింపుపై ప్రశ్నించినప్పుడు, గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సంబంధించిన సంస్థలు రహదారి దెబ్బతిన్న అనంతరం పునర్నిర్మించి సింగరేణికి అప్పగిస్తాయని అధికారులు చెప్పినట్లు శ్రీనివాస్ తెలిపారు. అయితే ప్రస్తుతం సింగరేణి నిధులతో రోడ్డు మరమ్మతులు చేపడుతున్నట్లయితే దానికి కారణాలు, ఒప్పంద నిబంధనలను బయటపెట్టాలని కోరారు.తెలంగాణ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్, 1966, MMDR Act, 1957కు సంబంధించిన నిబంధనల ప్రకారం ఓబీ మట్టి తరలింపు, రవాణా, పరిమాణం, తనిఖీలు, అనుమతులకు సంబంధించిన రికార్డులను వెల్లడించాలని డిమాండ్ చేశారు.కార్మికుల నివాస ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇళ్లు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సదుపాయాల కోసం నిధుల కొరత ఉందని చెబుతూ, మరోవైపు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు సంబంధించిన పనుల్లో సింగరేణి నిధులు ఖర్చు చేయడం అన్యాయమని శ్రీనివాస్ విమర్శించారు.ఓబీ మట్టి తరలింపు, భారీ వాహనాల రాకపోకలు, రోడ్డు నిర్మాణం–మరమ్మతుల ఖర్చు, కాంట్రాక్టు నిబంధనలు, ప్రమాదాలు తదితర అంశాలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి దృష్టికి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అవసరమైతే కేంద్ర విజిలెన్స్‌తో పాటు సంబంధిత కేంద్ర, రాష్ట్ర శాఖలకు ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ కోరుతామని చెప్పారు.సింగరేణి కంపెనీలోని విజిలెన్స్ విభాగం అధికారులు పనిచేస్తున్నారా? కంపెనీకి నష్టం జరిగితే బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని శ్రీనివాస్ ప్రశ్నించారు. కార్మిక కుటుంబాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, కంపెనీ నిధుల పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *