నల్లగొండలో గుంతలమయంగా ప్రధాన రహదారి.. వాహనదారుల అవస్థలు
గుంతలు పడి ఇబ్బంది పడుతున్న వాహనదారులురోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్

కోడిమ్యాల, ఆగస్టు 19: జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నల్లగొండ గ్రామ బస్టాండ్ ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఈ రహదారిపై ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనాలు, ప్రయాణికులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వాహనాల రాకపోకలకు కీలకంగా ఉన్న ఈ రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ప్రతి రోజు వేల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్, వేములవాడ నుంచి కొండగట్టు, జగిత్యాల వైపు రాకపోకలు సాగిస్తుంటాయి. వర్షాలు కురిసిన సమయంలో రహదారిపై ఉన్న గుంతల్లో నీరు నిలిచి వాహనదారులకు ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. గుంతలు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రాత్రి వేళల్లో గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు రహదారి మరమ్మతులపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రహదారిని వెంటనే పరిశీలించి గుంతలను పూడ్చడంతో పాటు అవసరమైన చోట రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు. రహదారి పరిస్థితిని నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
