లాక్రోస్ విజేతలను ఘనంగా సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ | సెప్టెంబర్ 4:మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన సౌత్ ఈస్ట్ కోస్ట్ లాక్రోస్ ఛాంపియన్షిప్–2026లో భారత మహిళా జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బీసీ గురుకుల విద్యార్థినులు పి. గోపిక, సంగీతలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించి అభినందించారు.అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, బీసీ గురుకులాలకు పేరు తీసుకువచ్చిన విద్యార్థినులను మంత్రి శాలువాతో సత్కరించారు. తృతీయ స్థానం సాధించినందుకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు బహుమతి అందించడంతో పాటు, వారి ప్రయాణ ఖర్చుల కోసం రూ.1.76 లక్షలు అందించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడి భారత మహిళా జట్టు కాంస్య పతకం సాధించడం గర్వకారణమన్నారు. ఇందులో తెలంగాణకు చెందిన బీసీ గురుకుల విద్యార్థినులు గోపిక, సంగీత భాగస్వామ్యం కావడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.క్రీడల్లో రాణించే విద్యార్థులకు ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విద్యార్థుల ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు మాట్లాడుతూ.. గోపిక, సంగీత ఐదో తరగతిలోనే బీసీ గురుకుల పాఠశాలలో చేరారని తెలిపారు. వారిలో లాక్రోస్పై ఉన్న ఆసక్తి, ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరూ బీసీ గురుకుల కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నారని తెలిపారు.గతంలో కర్నూలు, చెన్నైలో జరిగిన సౌత్ జోన్ ఛాంపియన్షిప్ పోటీల్లో వీరిద్దరూ బంగారు పతకాలు సాధించారని, ఆగ్రా, జమ్మూకశ్మీర్లో జరిగిన పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. తాజాగా మలేషియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించడం వారి ప్రతిభకు నిదర్శనమన్నారు.విద్యార్థినులకు క్రీడా శిక్షణ అందించిన లాక్రోస్ కోచ్లు పరమేశ్, ఆకాష్, ప్రిన్సిపాల్ శ్రీలతలను కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు
