ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం: బెక్కం జనార్ధన్


గంగాధర | BSK న్యూస్, ఆగస్టు 13: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలోని ముంపు ప్రభావిత ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జనసేన జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి బెక్కం జనార్ధన్ డిమాండ్ చేశారు. ముంపు కారణంగా ఇళ్లు, భూములు, పంటలు, జీవనోపాధి కోల్పోయిన బాధితులకు న్యాయమైన పరిహారం, గౌరవప్రదమైన పునరావాసం కల్పించాలని కోరారు.ముంపు గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించి బాధితుల పూర్తి జాబితాను ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న పరిహారాలను వెంటనే విడుదల చేయాలని బెక్కం జనార్ధన్ డిమాండ్ చేశారు. పునరావాస ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, పాఠశాలలు, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు.“ముంపు బాధితులు దయ కోరడం లేదు.. తమ భూములు, ఇళ్లు, పంటలకు న్యాయమైన పరిహారం, గౌరవప్రదమైన పునరావాసం కోరుతున్నారు” అని బెక్కం జనార్ధన్ అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గాజుల సంకీర్తన్, జగదీష్, శ్రీనివాస్, నిమిషకవి అజయ్, బిసగోని రాజశేఖర్, దూడం శ్రీనాథ్, కనకట్ల శ్రీనివాస్‌తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
