కృష్ణస్వామి ముదిరాజ్‌కు మంత్రుల ఘన నివాళి

హైదరాబాద్ | సెప్టెంబర్ 4:హైదరాబాద్ నగర తొలి మేయర్, విద్యావేత్త, జర్నలిస్ట్, రచయిత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కృష్ణస్వామి ముదిరాజ్ సామాజిక ఐక్యత, సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.కృష్ణస్వామి ముదిరాజ్ వంటి మహనీయుల ఆశయాలను రాజకీయ, సామాజిక జీవితంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం సాధించేందుకు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించారు.రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండి రాజకీయ, విద్యా, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. మంత్రి వాకిటి శ్రీహరి కింది స్థాయి నుంచి ఎన్నో కష్టాలు, పోరాటాలు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారని ప్రశంసించారు.సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ చాంపియన్‌గా నిలుస్తుందని, బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.దళితులు, బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాల్లో వారికి సముచిత ప్రాధాన్యతతో పాటు సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు.విద్య ద్వారా వెనుకబడిన వర్గాల యువతకు ఉన్నత అవకాశాలు కల్పిస్తే వారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెంది సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతారని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా అభివృద్ధి ద్వారానే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలను కొనసాగిస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు
